రాష్ట్రంలో 1000 రోజుల కాంగ్రెస్ దగా పాలన
సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు
హామీలు, రైతులు, మహిళలు, యువత సమస్యలపై ప్రజల్లోకి వెళ్తాం
కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది
బీఆర్‌ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు
కాకతీయ, ములుగు ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్లను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీఆర్‌ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు ములుగు జిల్లా వ్యాప్తంగా వరుస నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ చేపడుతున్నట్లు తెలిపారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, 14 డిక్లరేషన్లు, గ్యారంటీలను ప్రకటించిందని లక్ష్మణ్‌బాబు గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో అనేక హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. 1000 రోజుల పాలనలో రైతులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రజల ముందుంచి ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ లక్ష్యమని చెప్పారు.
సెప్టెంబర్ 2 నుంచి వరుస నిరసనలు
సెప్టెంబర్ 2న ములుగు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారంటీల అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని లక్ష్మణ్‌బాబు తెలిపారు. సెప్టెంబర్ 3న గోవిందరావుపేటలో రైతుల సమస్యలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. రైతు భరోసా, రైతుబీమా, కౌలు రైతులకు ఆర్థిక సహాయం, యూరియా కొరత తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో గోవిందరావుపేట మండలంలో పెద్ద సంఖ్యలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగు పెట్టుబడుల భారం రైతులను కుంగదీస్తోందని అన్నారు. సెప్టెంబర్ 4న మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల సమస్యలపై ఏటూరునాగారం ప్రాంతంలో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. సెప్టెంబర్ 5న విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తామన్నారు. సెప్టెంబర్ 6న వెంకటాపురం మండల కేంద్రంలో స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన సమస్యలపై కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారిందని, అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ఉపాధి హామీ పనులకు నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. సెప్టెంబర్ 7న ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పిస్తామని, సెప్టెంబర్ 8న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రాలు అందజేస్తామని లక్ష్మణ్‌బాబు వెల్లడించారు.
మోసంలో రేవంత్‌రెడ్డిదే నంబర్ వన్
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని లక్ష్మణ్‌బాబు తీవ్రంగా విమర్శించారు. రైతులు, మహిళలు, వృద్ధులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ.. ఆయనకు ‘మోసపు పిత’ అనే బిరుదు ప్రజల్లో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషిని ప్రజలు మరచిపోరని అన్నారు. కేసీఆర్‌ను ప్రజలకు దూరం చేయాలనే ప్రయత్నాలు ఎవరూ చేసినా ఫలించవని చెప్పారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని లక్ష్మణ్‌బాబు పేర్కొన్నారు. గత ఏడాది వడగండ్ల వానలతో పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అందలేదని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మంత్రి సీతక్క సమాధానం చెప్పాలి
ములుగు జిల్లాకు చెందిన మంత్రి సీతక్కకు కూడా పలు ప్రశ్నలు ఉన్నాయని లక్ష్మణ్‌బాబు అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, వరద బాధితుల పునరావాసం, సాగునీటి ప్రాజెక్టులు, వంతెనల నిర్మాణంపై ప్రభుత్వం ఏం చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో అర్హులైన గిరిజన కుటుంబాలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కొండాయి, ఊరుగుపేట తదితర ప్రాంతాల్లో వరదల కారణంగా ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించలేదని ఆరోపించారు. రామప్ప నుంచి లక్నవరం వరకు అనుసంధాన పనులు మూడేళ్లుగా ముందుకు సాగడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేయడం కంటే కొత్త ప్రాజెక్టులు, కాలువల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ములుగు జిల్లాగా ఏర్పాటు, ఏటూరునాగారాన్ని రెవెన్యూ డివిజన్‌గా చేయడం, మల్లంపల్లి మండల ఏర్పాటు, వైద్య కళాశాల, ఆస్పత్రి వంటి అంశాల్లో చర్యలు తీసుకున్నామని తెలిపారు. రామప్పకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా రావడంలోనూ గత ప్రభుత్వ కృషి ఉందని పేర్కొన్నారు. ములుగు ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని లక్ష్మణ్‌బాబు ఆరోపించారు. పామ్‌ఆయిల్ ఫ్యాక్టరీ కోసం రైతుల భూములు తీసుకుంటున్నప్పుడు వారికి తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కమలాపురంలోని పేపర్ పరిశ్రమకు సంబంధించి కొత్త పరిశ్రమ ఏర్పాటు అంశంలోనూ ప్రభుత్వం ముందడుగు వేయడం లేదని విమర్శించారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. వెంకటాపురం మండలంలోని కేశవాపూర్, నర్సాపూర్ ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఇక కోరడం కాదు.. డిమాండ్ చేస్తాం
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇప్పటివరకు విజ్ఞప్తులు చేశామని, ఇకపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని బీఆర్‌ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు చేపట్టే కార్యక్రమాలు రాజకీయ లబ్ధి కోసం కాదని, ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగానే నిర్వహిస్తున్నామని అన్నారు. ములుగు జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు స్పష్టం చేశారు.

