ఇనుగాలకు అవమానం
కుడా మాజీ చైర్మన్‌కు నో ఫేర్‌వెల్
ఆఘ మేఘాల మీద నూతన చైర్‌పర్సన్ చేత ప్రమాణం
గుండు సుధారాణి ప్రమాణ స్వీకారానికి దూరంగా వెంకట్రాంరెడ్డి
పాత టీడీపీ నేతలంతా జిల్లా కాంగ్రెస్‌లో ఒక్కటవుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ
పార్టీని పట్టుకుని ఏళ్లుగా ఉంటున్న నేతలకు అవమానాలే మిగులుతున్నాయనే ఆరోపణలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముదురుతున్న అచ్చ కాంగ్రెస్.. పచ్చ కాంగ్రెస్ రాజకీయ వివాదం
ప్రచారానికి అనుగుణంగా కీలక నేతల చర్యలు
కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల హవా
అధిష్ఠానంలోని కీలక నేతల మద్దతు వారికేనంటూ పాత క్యాడర్ మండిపాటు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో ‘అచ్చ కాంగ్రెస్.. పచ్చ కాంగ్రెస్’ రాజకీయ వివాదం మరోసారి తెరపైకి వస్తోంది. కుడా చైర్మన్‌గా ఇనుగాల వెంకట్రాంరెడ్డి పదవీకాలం ముగిసిన వెంటనే గుండు సుధారాణిని కొత్త చైర్‌పర్సన్‌గా నియమించడం.. ఆఘమేఘాలపై ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మాజీ చైర్మన్‌కు కనీసం వీడ్కోలు కార్యక్రమం కూడా నిర్వహించకపోవడం, కొత్త చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారానికి వెంకట్రాంరెడ్డి దూరంగా ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పదవి మార్పు సాధారణ పరిపాలనా ప్రక్రియే అయినా.. అందుకు అనుసరించిన తీరు మాత్రం పార్టీ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీసింది.
పాతవారికి ప్రాధాన్యం ఎక్కడ?
కాంగ్రెస్‌ను నమ్ముకుని ఏళ్ల తరబడి పనిచేసిన నేతలకు పదవులు, గుర్తింపు విషయంలో నిరాశే మిగులుతోందన్న అసంతృప్తి ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతలకు మాత్రం వరుసగా కీలక అవకాశాలు దక్కుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుడా చైర్మన్ పదవి విషయంలోనూ ఇదే అంశం తెరపైకి రావడంతో పాత కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడినవారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చినవారికి పెద్దపీట వేస్తున్నారన్న భావన బలపడితే దాని ప్రభావం భవిష్యత్ రాజకీయాలపై పడే అవకాశం ఉందని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది.
పాత టీడీపీ నేతలే ఒక వర్గంగా?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో టీడీపీలో పనిచేసిన పలువురు నేతలు ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఒకే వర్గంగా వ్యవహరిస్తున్నారన్న చర్చ తాజాగా ఊపందుకుంది. వీరికి అధిష్ఠానంలోని కీలక నేతల మద్దతు ఉందని, అందుకే పార్టీ పదవులు, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల విషయంలో వారి మాటకు ప్రాధాన్యం లభిస్తోందన్న ఆరోపణలు కాంగ్రెస్‌లోని మరో వర్గం నుంచి వినిపిస్తున్నాయి. పదవుల పంపకంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఈ కోణంలోనే కొందరు నేతలు విశ్లేషిస్తున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల హవా పెరుగుతోందన్న ప్రచారం, మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నేతలకు ప్రాధాన్యం తగ్గుతోందన్న అసంతృప్తి కలిసిపోవడంతో ‘అచ్చ కాంగ్రెస్.. పచ్చ కాంగ్రెస్’ వివాదం ముదురుతున్నట్లు తెలుస్తోంది. కుడా చైర్మన్ మార్పు సమయంలో కనిపించిన రాజకీయ సమీకరణాలు, మాజీ చైర్మన్ కార్యక్రమానికి దూరంగా ఉండటం వంటి పరిణామాలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. ప్రచారానికి అనుగుణంగానే కీలక నేతల వ్యవహారశైలి కనిపిస్తోందని కొందరు కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నట్లు సమాచారం. పార్టీని పటిష్ఠం చేయాల్సిన సమయంలో అంతర్గత విభేదాలు బహిరంగ చర్చకు రావడం నష్టమేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
అధిష్ఠానం మద్దతు ఎవరికి?
కొత్తగా కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతల హవాకు అధిష్ఠానంలోని కొందరు కీలక నేతలు మద్దతుగా నిలుస్తున్నారన్న ఆరోపణలు నిజమేనా? పార్టీ కోసం పనిచేసిన పాత నేతలకు వరుసగా ఎందుకు నిరాశ ఎదురవుతోంది? పదవుల కేటాయింపులో సామాజిక, రాజకీయ సమీకరణాలే ప్రాతిపదికనా.. లేక స్థానిక నాయకుల అభిప్రాయాలకూ విలువ ఉందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి. కుడా చైర్‌పర్సన్ నియామకం, మాజీ చైర్మన్‌కు వీడ్కోలు లేకపోవడం వంటి పరిణామాలు ఒక పదవికి సంబంధించిన అంశంగానే ముగుస్తాయా.. లేక ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో పాత, కొత్త నేతల మధ్య ఉన్న అంతరాన్ని మరింత పెంచుతాయా? అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

