రికార్డుల్లో ఒకలా.. మోకాపై మరోలా..
కాకతీయ కథనంపై తహసీల్దార్ నిర్లక్ష్యపు సమాధానం!
‘మా పరిధిలోకి రాదు’ అంటూ రెవెన్యూ అధికారి దాటవేత
గతంలో జీపీఏ లేఅవుట్ చేసి ఉంటే కోర్టు స్టేతో రిజిస్ట్రేషన్లు అడ్డుకోవచ్చన్న తహసీల్దార్
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్న వ్యవసాయ శాఖ
కాకతీయ, గీసుగొండ : రికార్డుల్లో వ్యవసాయ భూమిగా నమోదై ఉండి.. క్షేత్రస్థాయిలో మాత్రం వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారన్న ఆరోపణలపై వివరణ కోరితే బాధ్యతను మరో శాఖపైకి నెట్టడం రెవెన్యూ అధికారుల తీరుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. ‘రికార్డుల్లో ఒకలా.. మోకాపై మరోలా!’ అనే శీర్షికన కాకతీయ దినపత్రికలో ఈ నెల 3న ప్రచురితమైన కథనంపై గీసుగొండ తహసిల్దార్ ఎం.డి. రియాజుద్దీన్‌ను వివరణ కోరగా.. భూమి వ్యవసాయేతర వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే రికార్డుల్లో భూమి స్వరూపం, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రశ్నలు తలెత్తినప్పటికీ రెవెన్యూ శాఖ నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ఎందుకు జరగలేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సదరు భూమికి రైతుబంధు ప్రయోజనాలు పొందుతున్న వ్యక్తి అధికార పార్టీ నాయకుడనే ఆరోపణలు ఉండటంతో తహసిల్దార్ స్పందనపై స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలకు ఆధారాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
కోర్టు స్టేతో రిజిస్ట్రేషన్లు అడ్డుకోవచ్చు
భూమికి సంబంధించి గతంలో జీపీఏ ద్వారా లేఅవుట్ చేసి ఉంటే, సదరు భూమికి సంబంధించిన నిర్వాసితులు కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకుంటే.. తమ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డుకోవచ్చని తహసిల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ తెలిపారు. భూమి హక్కులు, రిజిస్ట్రేషన్ల విషయంలో న్యాయపరమైన ఆదేశాలు ఉంటే వాటి ప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
‘పరిశీలనలో తేలితే చర్యలు’.. వ్యవసాయ శాఖ స్పష్టీకరణ
ఇదే విషయంపై మండల వ్యవసాయ అధికారి వి. హరి ప్రసాద్ బాబును వివరణ కోరగా.. కాకతీయ కథనంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడతామని తెలిపారు. సదరు భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు పరిశీలనలో తేలితే రైతుబంధు పథకం ప్రయోజనాలను నిలిపివేయడంతో పాటు, ఇప్పటివరకు పథకం ద్వారా పొందిన నిధులను నిబంధనల మేరకు రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల స్పందనల నేపథ్యంలో ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలు ఏమిటన్నది అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనతో వెలుగులోకి రావాల్సి ఉంది.

