రిజిస్ట్రేషన్ ఆఫీసులో రైటర్లదే రాజ్యం
నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనధికార వ్యవస్థ
కొంతమంది డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వెళ్తేనే పని పూర్తి
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నేరుగా వెళ్తే రిజిస్ట్రేషన్‌కు కొర్రీలు
డాక్యుమెంటర్ రైటర్ల ద్వారా వెళ్తే అదనంగా రిజిస్ట్రేషన్‌కు రూ.10 వేల వసూళ్లు
కాకతీయ, వరంగల్ బ్యూరో : నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ వ్యవహారాలు డాక్యుమెంట్ రైటర్ల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు వచ్చే ప్రజలు నేరుగా కార్యాలయ సిబ్బందిని సంప్రదించకుండా ముందుగా డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ ఆస్తికి ఎంత విలువ చూపించాలి.. ఎలాంటి పత్రాలు సమర్పించాలి.. డాక్యుమెంట్‌లో ఏ వివరాలు నమోదు చేయాలన్న విషయాల్లోనూ రైటర్ల మాటే కీలకంగా మారింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారిక వ్యవస్థ కంటే బయట వ్యవస్థే బలంగా పనిచేస్తోందన్న చర్చ సాగుతోంది. ఫ్లాట్లు, నిర్మాణంలో ఉన్న ఆస్తులు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలోనూ నిబంధనల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఫ్లాట్లను గజాల చొప్పున రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యవహారం కనిపిస్తోంది. ఆయా నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా? లేఅవుట్, బిల్డింగ్ అనుమతులు, యాజమాన్య హక్కులు, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయా? రిజిస్ట్రేషన్‌కు ముందు అధికారులు వాటిని పూర్తిగా పరిశీలిస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. అదే సమయంలో ప్రతి రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు మరో రూ.10 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్న వ్యవహారం కూడా కార్యాలయంలో కొనసాగుతోంది.

‘యూనియన్’కే ప్రాధాన్యం.. రూ.70 వేల వ్యవహారం
డాక్యుమెంట్ రైటర్లు ఒక యూనియన్‌గా ఏర్పడి కార్యాలయంలో తమకంటూ ప్రత్యేక వ్యవస్థను కొనసాగిస్తున్నారు. యూనియన్‌లో ఉన్న రైటర్లు తయారు చేసిన డాక్యుమెంట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగుతుండగా, ఇతర రైటర్లు తీసుకొచ్చే డాక్యుమెంట్లలో మాత్రం అభ్యంతరాలు, కొర్రీలు, జాప్యాలు ఎదురవుతున్నాయి. యూనియన్‌లో చేరేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.70 వేల వరకు తీసుకునే వ్యవహారం కూడా ఉంది. ఈ మొత్తాన్ని ఎవరి అనుమతితో వసూలు చేస్తున్నారు? యూనియన్‌కు ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి ప్రాధాన్యం కల్పించేందుకు నిబంధన ఏమిటి? అనే ప్రశ్నలు వస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో యూనియన్ రైటర్లకు ప్రత్యేక సహకారం అందుతున్న తీరు కూడా పరిశీలించాల్సిన అంశంగా మారింది.
సిబ్బంది వాటాలపై వివాదం.. సెలవులతో జాప్యం
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సిబ్బంది స్థాయిలోనూ అదనపు వసూళ్ల వ్యవహారం సాగుతోంది. కొన్ని సందర్భాల్లో సిబ్బంది వసూలు చేసే మొత్తం సబ్ రిజిస్ట్రార్ కంటే ఎక్కువగా ఉంటోందన్న సమాచారం ఉంది. ఈ మొత్తాల్లో వాటాల విషయంలో కార్యాలయంలో విభేదాలు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సిబ్బందిలో కొందరిని బదిలీ చేసేందుకు ప్రయత్నాలు జరగడం, సబ్ రిజిస్ట్రార్–సిబ్బంది మధ్య సమన్వయం లేకపోతే సెలవులు పెట్టడం వంటి పరిణామాలతో రిజిస్ట్రేషన్ పనులు జాప్యమవుతున్నాయి. ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ విధులు నిర్వహించే సమయంలో ప్రజలు మరింత ఆలస్యాన్ని ఎదుర్కొంటున్నారు. కార్యాలయంలో అధికారిక ఫీజులు, ఇతర చార్జీల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉన్నప్పటికీ, వసూళ్లపై గందరగోళం కొనసాగుతోంది. ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించి సీసీ కెమెరాల దృశ్యాలు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ రికార్డులు, చలానాలు, రైటర్ల అనుమతులు, అదనపు వసూళ్ల వివరాలను పరిశీలిస్తే అసలు వ్యవహారం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

