ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం
ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
జాబ్ క్యాలెండర్‌తో సమగ్ర నోటిఫికేషన్లు జారీ చేయాలి
నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇవ్వాలి
డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్
కాకతీయ, ములుగు ప్రతినిధి : యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ అన్నారు. ప్రభుత్వాల అసమర్థ విధానాలతో దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన డీవైఎఫ్ఐ ములుగు జిల్లా 2వ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడిచినా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించలేదని ఆనగంటి వెంకటేష్ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని అన్నారు. నీట్, రైల్వే, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు విద్యార్థులు, యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోనే సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లోని
ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచినా జాబ్ క్యాలెండర్‌తో పాటు పలు హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. సమగ్ర వివరాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు.
స్వయం ఉపాధికి రుణాలు మంజూరు చేయాలి
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అందించాలని వెంకటేష్ డిమాండ్ చేశారు. స్వయం ఉపాధి కోసం ప్రకటించిన రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తులు స్వీకరించడంతోనే ప్రభుత్వం సరిపెట్టకుండా అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయాలని కోరారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి విద్యార్థులు, యువతను మాదకద్రవ్యాల బారినుంచి కాపాడాలని సూచించారు. ములుగు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కలువల రవీందర్ అధ్యక్షతన జరిగిన మహాసభలో జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అరుణ్, లాజర్, పూనెం కృష్ణబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రత్న ప్రవీణ్, జిల్లా నాయకులు మమత, శ్యామ్, రమేష్, రాఘవేంద్ర, సంతోష్, శివ, ప్రవీణ్, లోకేష్, అశోక్, దినేష్‌తో పాటు సుమారు 100 మంది యువత పాల్గొన్నారు.

