వరంగల్ చేనేతకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలి
ఆన్‌లైన్, ఈ–కామర్స్ వేదికల ద్వారా విక్రయాలు పెంచాలి
ఎక్స్‌పోర్ట్ హబ్, పర్యాటక రంగంతో మార్కెటింగ్ అవకాశాలు విస్తరించాలి
కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ : వరంగల్ చేనేత ఉత్పత్తులకు దేశీయ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తవాడలోని మట్టేవాడ, దయానంద్ చేనేత క్లస్టర్లను సందర్శించి ఉత్పత్తుల తయారీ విధానాన్ని పరిశీలించారు. చేనేత కార్మికులకు అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ సదుపాయాలపై అధికారులతో చర్చించారు. స్థానికంగా తయారయ్యే చేనేత ఉత్పత్తులను ఆన్‌లైన్, ఈ–కామర్స్ వేదికల ద్వారా ఇతర ప్రాంతాలతోపాటు విదేశాలకు చేరవేసేలా చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్ ఎక్స్‌పోర్ట్ హబ్‌ను సద్వినియోగం చేసుకుని చేనేతతోపాటు ఇతర స్థానిక ఉత్పత్తుల ఎగుమతులకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగాన్ని స్థానిక ఉత్పత్తుల విక్రయాలతో అనుసంధానించాలన్నారు. చేనేత కార్మికులు, ఉత్పత్తిదారుల సంఘాలకు సాంకేతిక శిక్షణ, నాణ్యత ప్రమాణాలు, బ్రాండింగ్, ప్యాకేజింగ్‌లో సహకారం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నరసింహమూర్తి, రాష్ట్ర చేనేత వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

