భగీరథిపేట ప్రాజెక్టులో లంచం బాగోతం!
భూపాలపల్లిలో ప్రాజెక్టు అధికారి సతీష్‌రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ రాజు అరెస్టు
రూ.39.17 లక్షల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ గుర్తింపు
బిల్లుల చెల్లింపులు, కొత్త పనుల కేటాయింపునకు లంచం డిమాండ్
వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ సాంబయ్య
కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భగీరథిపేట ప్రాజెక్టుకు చెందిన ఇద్దరు ప్రభుత్వ అధికారులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన–2.0 పథకం కింద చేపట్టిన పనుల బిల్లుల ప్రాసెసింగ్, తదుపరి పనుల కేటాయింపునకు కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఈ మేరకు ఏసీబీ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలు వెల్లడించింది. ఏసీబీ ప్రకటన ప్రకారం.. భగీరథిపేట ప్రాజెక్టు అధికారి సతీశ్ రెడ్డి, సాంకేతిక అధికారి రాజు కాంట్రాక్టర్ నుంచి బిల్లుల మొత్తంలో 10 నుంచి 25 శాతం వరకు అక్రమంగా డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. కోరిన మొత్తం చెల్లించకపోతే పెండింగ్ బిల్లులు ప్రాసెస్ చేయబోమని, తదుపరి పనులు కేటాయించబోమని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

రూ.39.17 లక్షల లావాదేవీలపై విచారణ
ఏసీబీ ధ్రువీకరణ ప్రక్రియలో భాగంగా మొత్తం రూ.39,17,000 వివిధ బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించామని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లావాదేవీలు నిందితుల సూచనల మేరకు జరిగినట్లు ఫిర్యాదుదారు ఆరోపించినట్లు తెలిపింది. దీనికి మద్దతుగా బ్యాంకు స్టేట్మెంట్లు, వాట్సాప్ చాట్ రికార్డులను కూడా అందించినట్లు పేర్కొంది. అదనంగా, ఏడో బిల్లుకు సంబంధించిన మొత్తంలో మరో 25 శాతం చెల్లించాలని సతీశ్ రెడ్డి డిమాండ్ చేసినట్లు ఏసీబీ ప్రకటన వెల్లడించింది. పనుల కొలతల నమోదు, పెండింగ్ బిల్లుల ప్రాసెసింగ్‌తో ఈ డిమాండ్‌కు సంబంధం ఉన్నట్లు తెలిపింది. ఆధారాలు, సంబంధిత అధికారుల అనుమతి ఆధారంగా అవినీతి నిరోధక చట్టం–1988లోని సెక్షన్లు 7(ఎ), 7(బి), 13(1)(బి)తోపాటు 13(2) కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు వెల్లడించారు. సతీశ్ రెడ్డి, రాజులను అరెస్టు చేసి వరంగల్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

