పోలీస్ అమరవీరుల త్యాగాలను విస్మరించొద్దు
సామాజిక సేవలో పోలీసుల ముందడుగు
వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
సైకిల్ ర్యాలీతో ఆరోగ్యంపై అవగాహన
రక్తదాన శిబిరంలో 101 యూనిట్ల రక్తం సేకరణ
89 ఏళ్ల వయసులోనూ ర్యాలీలో పాల్గొన్న మామిడి నర్సయ్య
కాకతీయ, వరంగల్ బ్యూరో : పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీ, రక్తదాన శిబిరం సామాజిక బాధ్యతను చాటిచెప్పాయి. పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో సైకిల్ ర్యాలీ ద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పించగా, భీమారం శుభం ఫంక్షన్ హాల్లో రెడ్‌క్రాస్ సంస్థ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 101 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. నగరంలోని వివిధ సైక్లిస్ట్ బృందాలకు చెందిన సుమారు 200 మంది ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి సేవలను ఎప్పటికీ మరువకూడదని అన్నారు. సైక్లింగ్ వంటి వ్యాయామాలు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని, ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో వ్యాయామానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. 60 ఏళ్లు పైబడిన వారు సైతం ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా 89 ఏళ్ల వయసులో ర్యాలీలో పాల్గొన్న మామిడి నర్సయ్యను ప్రత్యేకంగా అభినందించారు. వయస్సు వ్యాయామానికి అడ్డంకి కాదని ఆయన నిరూపించారని తెలిపారు. భీమారం శుభం ఫంక్షన్ హాల్లో జరిగిన రక్తదాన శిబిరంలో సీపీ ఎన్. శ్వేత స్వయంగా రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం విలువైన ప్రాణాలను కాపాడుతుందని, ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సైకిల్ ర్యాలీని విజయవంతంగా నిర్వహించిన ఏఆర్ అదనపు డీసీపీలు వి. శ్రీనివాస్, సురేష్, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్‌లను అభినందించారు. ర్యాలీలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, ఏసీపీలు మధుసూదన్, సత్యనారాయణ, ఏఆర్ ఏసీపీలు నాగయ్య, అనంతయ్య, సురేంద్ర, ఇతర పోలీస్ అధికారులు, సీఐలు, ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఇ.వి. శ్రీనివాస్ రావు, జిల్లా పాలక మండలి సభ్యుడు కె. రాకేష్ రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

