బాల్యవివాహాలతో అనారోగ్య సమస్యలు
చట్ట ఉల్లంఘనకు జైలు, జరిమానా
ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి
బాల్యవివాహాల నిరోధక చట్టంపై అవగాహన సదస్సు
కాకతీయ, మానకొండూరు: బాల్యవివాహాల నిరోధక చట్టం–2006పై అంగన్వాడీ టీచర్లకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మానకొండూరులోని ప్రభుత్వ బాలికల పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఎస్ఆర్డీ కమ్యూనిటీ సోషల్ వర్కర్ కోమల మాట్లాడుతూ 18 ఏళ్లు నిండని అమ్మాయికి, 21 ఏళ్లు నిండని అబ్బాయికి వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. బాల్యవివాహాల్లో పాల్గొన్నవారు, ప్రోత్సహించినవారూ శిక్షార్హులని వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

