తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనివ్వం!
కులమతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను ప్రజలు అంగీకరించరు
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే మా లక్ష్యం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో అధికారంలోకి వస్తామని, కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికి దక్కాలన్నది నాయకుల ప్రకటనలతో కాదని, ప్రజల తీర్పుతోనే నిర్ణయమవుతుందని స్పష్టం చేశారు. కూకట్పల్లిలో జరిగిన సమావేశంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న బీజేపీ నేతల కలలు కలలుగానే మిగిలిపోతాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతూ దేశం కోసం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ అని, ఆయనను ప్రధానమంత్రిని చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం దిశగా సాగుతోందన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను తెలంగాణ ప్రజలు అంగీకరించరని, బీజేపీకి ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం చెబుతామని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు.

