అర్హతలేని వైద్యం.. నాలుగు ఆస్పత్రులపై కేసులు!
ఆగస్టులో ఉర్సు ప్రాంతంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు
అర్హత లేని వారు అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు గుర్తింపు
నిర్వాహకులపై ఏజే మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
నవంబర్ 6న ఎఫ్‌ఐఆర్ నమోదు..
కాకతీయ, హన్మకొండ : వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అర్హతలేని వ్యక్తులపై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చర్యలకు దిగింది. సరైన వైద్య అర్హతలు, చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ లేకుండానే అల్లోపతి వైద్యం నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదులపై వరంగల్‌లో నాలుగు కేంద్రాల నిర్వాహకులపై పోలీసు కేసు నమోదైంది. ఉర్సు ప్రాంతంలో నిర్వహిస్తున్న క్లినిక్‌లు, ఫార్మసీ, ప్రథమ చికిత్స కేంద్రాలపై కౌన్సిల్ తనిఖీలు చేపట్టి వివరాలు సేకరించింది. కౌన్సిల్ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు ఏజే మిల్స్ కాలనీ పోలీసులు నవంబర్ 6న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అర్హత లేని వ్యక్తులు వైద్యులుగా చలామణి అవుతూ చికిత్సలు అందిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ ఘటన ద్వారా కౌన్సిల్ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు చెందిన డాక్టర్ కె.యు.ఎన్. విష్ణు, డాక్టర్ అన్వర్ మియాతో కూడిన తనిఖీ బృందం 2026 ఆగస్టు 5న వరంగల్‌లోని ఉర్సు ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా నాలుగు కేంద్రాల్లో అర్హతలు, వైద్య సేవల నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించినట్లు కౌన్సిల్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సరైన వైద్య అర్హతలు లేకుండానే అల్లోపతి వైద్యం నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపింది. ఈ తనిఖీల ఆధారంగా సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ పోలీసులను ఆశ్రయించింది.

అప్పుడు తనిఖీలు..ఇప్పుడు కేసులు..
తనిఖీల్లో ఉర్సు జాగీర్‌లోని ఎస్. జయలక్ష్మి క్లినిక్ నిర్వాహకుడిగా చిట్యాల సిద్ధేశ్వర్, ఉర్సు మెయిన్ రోడ్డులోని అన్విక్ష ఫార్మసీ నిర్వాహకుడు గాడె శివశంకర్ (బి.ఫార్మసీ), ఉర్సు బోడ్రాయి, కరీమాబాద్ రోడ్డులోని ప్రథమ చికిత్స కేంద్రం నిర్వాహకుడిగా గడ్డం హరీష్ (ఇంటర్మీడియట్), ఉర్సు బొడ్రాయిలోని మరో ప్రథమ చికిత్స కేంద్రం నిర్వాహకుడిగా గడ్డం శ్రీనివాస్ పేర్లను ఫిర్యాదులో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ దండెం లాలయ్య కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏజే మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నంబర్ 832/2026 నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని 318(4), 319(2) సెక్షన్లతోపాటు తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్టం–1968లోని 20(ii), 21, 22 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కౌన్సిల్ వెల్లడించింది. వైద్య అర్హతలు, రిజిస్ట్రేషన్ లేకుండా వైద్య సేవలు నిర్వహించడం, తప్పుడు వైద్య గుర్తింపుతో ప్రజలను మోసగించడం వంటి అంశాలపై చట్టపరమైన చర్యలకు ఈ సెక్షన్లను ప్రస్తావించారు.
చట్టంలో శిక్షలు.. ఉల్లంఘిస్తే చర్యలు
కౌన్సిల్ వివరాల ప్రకారం సెక్షన్ 318(4) కింద మోసం నేరానికి గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశం ఉంది. సెక్షన్ 319(2) కింద గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 21 కింద తప్పుడు వైద్య రిజిస్ట్రేషన్‌కు రూ.500 జరిమానా ప్రస్తావించగా, సెక్షన్ 22 కింద అనధికారిక వైద్య ప్రాక్టీస్ మొదటిసారి రుజువైతే గరిష్ఠంగా మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎంబీబీఎస్ లేదా చట్టబద్ధమైన వైద్య అర్హతలు, సంబంధిత రిజిస్ట్రేషన్ లేకుండా అల్లోపతి వైద్యం నిర్వహించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని మెడికల్ కౌన్సిల్ హెచ్చరించింది. సరైన వైద్య పరిజ్ఞానం లేని వ్యక్తుల వద్ద చికిత్స చేయించుకోవడం వల్ల రోగులు తీవ్ర ఆరోగ్య సమస్యలు, ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొంది. అందువల్ల ప్రజలు వైద్యం చేయించుకునే ముందు వైద్యుల విద్యార్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించుకోవాలని సూచించింది.

