గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
19లోగా గ్రామ సంఘాల భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలి
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వసంత
కాకతీయ, గీసుగొండ : గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వసంత అధికారులను ఆదేశించారు.మండలంలోని కొనాయిమాకుల,హర్జ్యా తండా,మచ్చాపూర్ గ్రామాల్లో పర్యటించిన ఆమె వివిధ ప్రభుత్వ పథకాల కింద చేపడుతున్న నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిని సమీక్షించారు.గ్రామ సంఘాల భవనాల నిర్మాణాలు, ఇంకుడు గుంతలు, మురుగు కాలువల చివరన నిర్మించే నీటి ఇంకుడు గుంతలు, పైకప్పులపై వర్షపు నీటి నిల్వ నిర్మాణాల పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో జాప్యం చేయకుండా వేగవంతం చేసి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో జలసిరి పనులతో పాటు స్వచ్ఛ భారత్ గ్రామీణ పథకం కింద చేపట్టాల్సిన మురుగు కాలువల చివరన నీటి ఇంకుడు గుంతల నిర్మాణాలను వెంటనే ప్రారంభించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గ్రామ సంఘాల భవనాల నిర్మాణాలను నవంబర్ 19వ తేదీలోగా పూర్తి చేయాలని, జలసిరి పనులన్నింటినీ ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని గడువు విధించారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేసేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఎంపీడీవో శ్రీధర్, పంచాయతీరాజ్ శాఖ సహాయ ఇంజనీర్ అనిల్ కుమార్,గ్రామీణ ఉపాధి పథకం సిబ్బంది శ్రీలత, సాంకేతిక సహాయకులు సత్యనారాయణ సింగ్, సుష్మ,సర్పంచులు వజ్ర రాజు,వీరన్న, పంచాయతీ కార్యదర్శులు రామారావు, శాంత,సునీత,క్షేత్రస్థాయి సహాయకులు రాజ్ మహ్మద్,కరుణాకర్, స్థానికులు పాల్గొన్నారు.

