లక్ష్యాల సాధనలోప్రథమ స్థానం దక్కాలి
అధికారులకు డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య దిశానిర్దేశం
కాకతీయ, హన్మకొండ : జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి, రాష్ట్రస్థాయిలో హనుమకొండను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య అధికారులకు సూచించారు. శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. గర్భిణీల ముందస్తు నమోదు, హైరిస్క్ గర్భిణీల గుర్తింపు, సాధారణ ప్రసవాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. చిన్నారుల టీకాల వివరాలను యూ-విన్ పోర్టల్‌లో నమోదు చేయాలని, అర్హులైన ప్రతి చిన్నారికి టీకాలు అందేలా చూడాలన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. క్షయ, హెచ్ఐవీ, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెనుకబడిన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుని లక్ష్యాలను సాధించాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ మదన్మోహన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రదీప్‌రెడ్డి, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ రజిత, డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ మురళి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కోలా రాజేష్‌కుమార్, వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బంది పాల్గొన్నారు

