బీఆర్ఎస్ పోరాటంతో కదిలిన సాగునీటి పనులు
ధర్నా హెచ్చరికతో స్పందించిన అధికారులు
ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కాలువలు, పైప్‌లైన్ల నిర్మాణం ప్రారంభం
కాకతీయ, నర్సంపేట టౌన్: రైతుల సాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ చేసిన పోరాటంతోనే ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కాలువలు, పైప్‌లైన్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి అన్నారు. పనులు ప్రారంభించకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించడంతో అధికార యంత్రాంగం స్పందించిందని శుక్రవారం తెలిపారు. 2009లో టెండర్లు దక్కించుకుని ఒప్పందం చేసుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇప్పటివరకు పనులు పూర్తి చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని సారంగపాణి పేర్కొన్నారు. కాలువలు, పైప్‌లైన్ల నిర్మాణంలో జాప్యం కారణంగా సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధం కావడంతో అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులు, కాంట్రాక్టర్లు స్పందించి పనులు ప్రారంభించారని తెలిపారు. పీఏసీఎస్ మాజీ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ మాట్లాడుతూ పనులు ప్రారంభించడంతో సరిపెట్టకుండా నిర్దిష్ట గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పురోగతిని పర్యవేక్షించాలన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందేవరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, మళ్లీ నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

