వైభవంగా నాగుల చవితి వేడుకలు
నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
పంచామృత కావడులతో స్వామివారికి అభిషేకాలు
పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న మహిళా భక్తులు
కాకతీయ, గీసుగొండ: నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఊకల్‌లోని శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం ఆలయ ప్రధానార్చకులు సముద్రాల సుదర్శనాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల దీక్షలు చేపట్టిన స్వాములు కావడుల్లో తీసుకొచ్చిన పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు చేసి, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. నాగుల చవితి రోజున స్వామివారిని దర్శించుకుని పుట్టలో పాలు పోసి, వెండి కన్ను, పైడికన్ను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని ప్రధానార్చకులు తెలిపారు. వివాహం కానివారు, సంతానం లేని దంపతులు, విదేశీ ప్రయాణాలు కోరుకునేవారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. చర్మ, శ్వాస, వినికిడి, గొంతు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని భక్తులు నమ్ముతారని తెలిపారు. రైతులు పాడిపంటలు సమృద్ధిగా పండాలని స్వామివారిని ప్రార్థిస్తారని చెప్పారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామిరెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళా భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కక్కెర్ల సుభాష్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

