చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి
నెహ్రూ ఆశయాలతో సమానత్వ సమాజ నిర్మాణం
నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్
కాకతీయ, నర్సంపేట టౌన్ : ప్రతి చిన్నారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ పిలుపునిచ్చారు. దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను పురస్కరించుకుని శనివారం నర్సంపేట పట్టణంలోని నెహ్రూ విగ్రహం వద్ద పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు. విద్య, విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి నెహ్రూ వేసిన పునాదులు దేశ ప్రగతికి బాటలు వేశాయని అన్నారు. సమానత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాలల హక్కులను పరిరక్షిస్తూ వారి సృజనాత్మకతను వెలికితీయాలని, వివక్షకు తావులేని సమాజాన్ని నిర్మించాలని సూచించారు. చిన్నారులకు నాణ్యమైన, విలువలతో కూడిన విద్య అందించినప్పుడే నెహ్రూ ఆశయాలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొంటూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల సాంబరెడ్డి, కౌన్సిలర్లు ఎలకంటి విజయ్‌కుమార్, పున్నం నరసింహారెడ్డి, సలావుద్దీన్ అయూబ్ ఖాన్, బాణాల ప్రసన్న శ్రీనివాస్, శ్రీరామోజు రోజారాణి, పొన్నాల మనిషా ప్రకాష్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేముల సాంబయ్య గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎర్ర యాకూబ్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి మురళి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధోని కీర్తన, గుడిపూడి అరుణ, కుంకిస అరుణ, గద్ద జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

