పుష్కర ఘాట్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
నిర్ణీత గడువులో అభివృద్ధి పనులు చేపట్టాలి
: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో
కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని గోదావరి పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. గురువారం పుష్కర ఘాట్‌ను సందర్శించి ప్రతిపాదిత పనులు, భక్తుల భద్రతకు చేపట్టాల్సిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాత ట్యాపులు, పంపులు, 25 హెచ్‌పీ మోటార్లు, విద్యుత్ పరికరాలు, పైప్లైన్ల తొలగింపు, ఇన్ఫిల్ట్రేషన్ బావుల నిర్మాణం, ఇసుక తొలగింపు, క్లోరినేషన్ పనులపై సమీక్షించారు. మహిళల కోసం దుస్తులు మార్చుకునే గదులు, నదికి ఎగువ, దిగువ ప్రాంతాల్లో చెక్క, ఐరన్ మెష్ బారికేడ్లు, క్రాస్‌బండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. పనుల పురోగతిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు.

