నేరాల నియంత్రణే లక్ష్యం కావాలి
రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
సామాన్యులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాల అందజేత
కాకతీయ, కొత్తగూడెం: జిల్లాలోని శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మంగళవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కాన్ఫరెన్స్ హాలులో పోలీసు అధికారులతో వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించడంతో పాటు, విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని అభినందించి రివార్డులు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించాలని, నిరంతరం వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు. నేరాల నియంత్రణ కోసం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటును ముమ్మరం చేయాలని, ప్రజలను ఇందులో భాగస్వాములను చేయాలని తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం..
గంజాయి అక్రమ రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగులు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు. పోక్సో కేసులలో విచారణను వేగవంతం చేసి, నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూడాలన్నారు. వేసవి సెలవుల దృష్ట్యా ఇళ్లలో దొంగతనాలు జరగకుండా పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని ఎస్పీ సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్ మరియు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. అలాగే షీ టీమ్స్, భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉంటూ మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, సైబర్ క్రైమ్స్ డీఎస్పీ అశోక్, పలువురు ఇన్స్పెక్టర్లు, ఐటీ సెల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

