ఇంత కక్కుర్తా ?
రూ. 25 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్..
ఏసీబీ వలలో నారాయణపేట ఆర్డీవో రాంచంద్రనాయక్
వచ్చే అక్టోబర్‌లోనే రిటైర్మెంట్!
ఆర్టీవో కార్యాయంలో అవినీతి నిరోధక శాఖ దాడులు
కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: లంచాలు ఇవ్వడం, తీసుకోవడం నేరం.. లంచాలను ప్రోత్సహించొద్దని, అవినీతికి పాల్పడుతున్న అధికారులను నియంత్రించేందుకు ఏసీబీ అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఎక్కడో ఒక చోట అవినీతి బయటపడుతూనే ఉంది. బాధ్యత గల ఉద్యోగాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరిచిపోయి లంచాలు దండుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నారు. తాజాగా నారాయణపేట ఆర్డీవో రాంచంద్ర నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడం డిపార్ట్మెంట్లో కలకలంరేపింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నారాయణపేట ఆర్డీవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది. ఓ వ్యక్తి నుంచి 25వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆర్డీవో రాంచంద్ర నాయక్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాంచంద్రనాయక్ ఈ ఏడాది అక్టోబర్ లో రిటైర్మెంట్ కావాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని లేదా 9440446106 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఉన్నతాధికారి కోరారు.

