జేఈఈ మెయిన్స్‌లో షైన్ విద్యార్థిని ప్రతిభ
ఆల్ ఇండియా స్థాయిలో 50వ ర్యాంకు సాధించిన లహరి
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యే లక్ష్యం
స్కూల్ కరస్పాండెంట్ అన్సర్ పాషా
కాకతీయ, బోనకల్ : ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో బోనకల్‌లోని షైన్ హై స్కూల్ విద్యార్థిని వి. లహరి జాతీయ స్థాయిలో 50వ ర్యాంకు సాధించి మండల కీర్తిని చాటింది. రావినూతల గ్రామానికి చెందిన రామకృష్ణ కుమార్తె అయిన లహరి, నర్సరీ నుంచి పదో తరగతి వరకు షైన్ హై స్కూల్‌లోనే చదివింది. ప్రస్తుతం ఖమ్మంలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ ఈ ఘనత సాధించింది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తమ పాఠశాల బలమైన పునాది వేస్తోందని కరస్పాండెంట్ అన్సర్ పాషా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇటీవలి ఇంటర్ ఫలితాల్లోనూ రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు సాధించిన సాయి హర్షినితో పాటు సుష్మ, జ్యోషిత, ఉమామహేష్ (466 మార్కులు) వంటి ప్రతిభావంతులంతా తమ పాఠశాల పూర్వ విద్యార్థులే కావడం గర్వకారణమన్నారు. మరో 10 మందికి పైగా విద్యార్థులు 400 పైగా మార్కులు సాధించారని తెలిపారు. గ్రామీణ ప్రాంత పిల్లలకు ఆధునిక విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ ఏడాది నుంచి ఐఐటీ శిక్షణను ప్రవేశపెట్టామని, విద్యార్థులు అందులోనూ మంచి ప్రతిభ కనబరుస్తున్నారని అన్సర్ పాషా వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఐటీ విద్యను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడంతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ కోర్సులను కూడా పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. తమ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ లాల్ మహమ్మద్, ప్రిన్సిపాల్ శ్వేత, అడ్మినిస్ట్రేటర్ డేగల వేలాద్రి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

