ఫోన్లలో సైరన్ మోగినా.. కంగారు పడొద్దు!
రేపు దేశవ్యాప్తంగా సాచెట్ సిస్టమ్ పరీక్ష
అప్రమత్తం చేయడమే లక్ష్యం: కేంద్రం వెల్లడి
కాకతీయ, నేషనల్ డెస్క్ : మీ మొబైల్ ఫోన్‌లో రేపు (మే 2న) ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించిందా? అయితే కంగారు పడకండి.. అది విపత్తుల నుంచి మిమ్మల్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న పరీక్ష మాత్రమే. భవిష్యత్తులో వరదలు, తుఫానులు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను క్షణాల్లో అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాచెట్’ (SACHET) అనే సరికొత్త వ్యవస్థను రూపొందించింది. టెలికమ్యూనికేషన్ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) సంయుక్తంగా రేపు ఈ వ్యవస్థ పనితీరును పరీక్షించనున్నాయి. రేపు దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లకు ఒక సందేశం (మెసేజ్) వస్తుంది. ఆ మెసేజ్ వస్తున్న సమయంలో ఫోన్ నుంచి పెద్ద ఎత్తున సైరన్ శబ్దం వినిపిస్తుంది. ఇది కేవలం పరీక్ష (టెస్ట్) మాత్రమే కాబట్టి, ఆ శబ్దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని, ఆ సందేశానికి స్పందించాల్సిన పనిలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) ప్రమాణాల ప్రకారం ‘కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్’ (CAP) టెక్నాలజీతో ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
సెకన్ల వ్యవధిలో సమాచారం..
విపత్తులు సంభవించినప్పుడు వేలమందికి అతి తక్కువ సమయంలో సమాచారం చేరవేయడం ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశ్యం. దీనివల్ల భారీ ప్రాణ నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుంది. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ హెచ్చరికలు వెళ్లేలా అధునాతన సాంకేతికతను రూపొందించారు. ప్రస్తుతం ఈ విధానం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చింది.

