టెన్త్‌లో అద్వైత నాయక్ అద్భుత ప్రతిభ
రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రథమ స్థానం
తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వమే విజయానికి తోడు
డీఈవో నుంచి ప్రశంసా పత్రం అందుకున్న విద్యార్థిని
కాకతీయ, వేములవాడ : కృషి, పట్టుదల ఉంటే అసాధారణ విజయాలు సాధ్యమేనని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అజ్మీరా అద్వైత నాయక్ నిరూపించింది. ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఈమె రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్ సాధించి మెరిసింది. కొనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామం అజ్మీరా తండాకు చెందిన అద్వైత, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రథమ స్థానం దక్కించుకుని అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రభుత్వ ఉద్యోగులైన తన తల్లిదండ్రుల పర్యవేక్షణలో క్రమశిక్షణతో చదివి ఈ ఘనత సాధించింది.
ఇది నా తల్లిదండ్రుల కష్టం : అద్వైత నాయక్
ఈ విజయం నా ఒక్కదానిది కాదు.. నా తల్లిదండ్రుల కష్టం, గురువుల మార్గదర్శకత్వం వల్లే సాధ్యమైంది. వారు నాపై ఉంచిన నమ్మకమే నన్ను ముందుకు నడిపించింది. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో చదవాలని ప్రోత్సహించారు. ప్రతిరోజూ ఒక లక్ష్యంతో చదివాను. కష్టపడితే ఏదైనా సాధించవచ్చనే నమ్మకం నాకు కలిగింది. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి నా తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకువస్తాను.
ఒక ఉపాధ్యాయురాలిగా గర్విస్తున్నా: అజ్మీరా స్వరూప (తల్లి)
పిల్లలకు విద్య విలువ చెప్పడం నా వృత్తి.. అదే విలువను నా కూతురి జీవితంలో చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అద్వైత ప్రతిరోజూ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఆమె చదువుపై చూపే ఆసక్తి, క్రమశిక్షణే ఈ విజయానికి అసలు కారణం. మేము కేవలం మార్గదర్శనం మాత్రమే చేశాం, కానీ ఆమె తన కష్టపడే తత్వంతో ఈ స్థాయికి చేరుకుంది. ఒక తల్లిగానే కాకుండా, ఒక ఉపాధ్యాయురాలిగా కూడా నా కూతురిని చూసి ఎంతో గర్వపడుతున్నాను.
అభినందనల వెల్లువ..
అద్వైత సాధించిన అద్భుత విజయానికి గాను జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) నుంచి ఆమె ప్రశంసా పత్రాన్ని అందుకుంది. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, స్థానికులు అద్వైతను కలిసి అభినందనలు తెలిపారు. అజ్మీరా తండా నుంచి రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

