వంటింట్లో యుద్ధం సెగలు
ఆకాశాన్నంటుతున్న నూనె ధరలు
వంటగది బడ్జెట్‌లో అస్తవ్యస్తం
నెల రోజుల్లోనే వంట నూనెల ధరల్లో 22 శాతం పెరుగుదల
రూ. 200 మార్కును దాటిన సన్ ఫ్లవర్ ఆయిల్
పామాయిల్ నూనె ధర 140 పై మాటే
ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో సగటు జీవిపై భారం
కాకతీయ,తెలంగాణ బ్యూరో : అంతర్జాతీయ సరిహద్దుల్లో మోగుతున్న యుద్ధ భేరీల సెగ ఇప్పుడు నేరుగా భారతీయ మధ్యతరగతి గృహిణి వంటగదికి తగిలిందని, అగ్రరాజ్యాల పంతాల మధ్య సామాన్యుడి వంటింటి బడ్జెట్ అస్తవ్యస్తమవుతోందని గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సముద్ర మార్గాల్లో రవాణాను స్తంభింపజేయడమే కాకుండా, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడానికి కారణమవుతున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధం ఇక్కడ సామాన్యుడి నూనె ప్యాకెట్ ధరను భారీగా పెంచుతోంది. యుద్ధాన్ని సాకుగా చూపి కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం సామాన్యుడి పాలిట శాపంగా మారింది.
నూనె ధరల షాక్
కేవలం నెల రోజుల వ్యవధిలోనే వంట నూనెల ధరలు ఏకంగా 22 శాతం మేర పెరగడం గమనార్హం. ఒకప్పుడు అందుబాటులో ఉన్న సన్ ఫ్లవర్ ఆయిల్ ధర ఇప్పుడు కిలో 180 రూపాయల నుండి 200 రూపాయల మార్కును దాటేసింది. పేదవాడికి దన్నుగా ఉండే పామాయిల్ కూడా ఏమాత్రం తగ్గనంటూ 120 నుండి 145 రూపాయలకు చేరుకుంది. ఇక వేరుశనగ నూనె విషయానికి వస్తే కిలోపై 15 రూపాయలు పెరగడమే కాకుండా, 15 కిలోల హోల్ సేల్ టిన్ను ధర 2,400 రూపాయలకు పైగా పలుకుతోంది. రైస్ బ్రాన్, సోయాబీన్, ఆవ నూనె వంటి ఏ నూనెను ముట్టుకున్నా ధరలు షాక్ కొడుతున్నాయి. ఆవ నూనె నుండి వనస్పతి వరకు ప్రతిదీ సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతున్నాయి.
పెరిగిన జీవన భారం
ధరల పెరుగుదల కేవలం నూనెకే పరిమితం కాకుండా అన్ని రంగాలకు విస్తరించింది. ఒకవైపు గ్యాస్ సిలిండర్ ధరలు నిప్పులు కక్కుతుంటే, మరోవైపు రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువులన్నీ ప్రియమయ్యాయి. కమర్షియల్ సిలిండర్ల ధరల పెరుగుదల వల్ల హోటళ్లు, రెస్టారెంట్లలో టిఫిన్లు, భోజనాల ధరలు పెరిగిపోయాయి. దీంతో బయట తినలేక, ఇంట్లో వండుకోలేక సగటు జీవి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నా స్థానికంగా కృత్రిమ కొరత ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజలు గుర్తు చేస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
యుద్ధ మేఘాల మాటున నక్కిన నల్లబజారు వ్యాపారులు నిల్వలను దాచిపెట్టి ధరలను మరింత పెంచుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారులు వెంటనే రంగంలోకి దిగి నిల్వ కేంద్రాలపై తనిఖీలు చేపట్టాలని, అక్రమంగా రేట్లను పెంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వంటింటి బడ్జెట్ అదుపు తప్పకముందే పాలకులు మేల్కొనకపోతే సామాన్యుడి బతుకు భారమై చివరకు కన్నీళ్లే మిగులుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాల ధరలను అదుపులోకి తెచ్చి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.

