పాతర్లపాడులో ‘అగ్ని’ బీభత్సం.. రూ. 28 లక్షల నష్టం!
మొక్కజొన్న కల్లాలు, గొర్రెల మందపైకి దూసుకెళ్లిన మంటలు
800 క్వింటాళ్ల ధాన్యం, 30 గొర్రెలు అగ్నికి ఆహుతి
కన్నీరుమున్నీరవుతున్న అన్నదాతలు, గొర్రెల కాపరి
కాకతీయ, చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భారీ అగ్ని ప్రమాదం రైతులకు తీరని వేదన మిగిల్చింది. ఈ ప్రమాదంలో సుమారు 800 క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యం కాలి బూడిదవ్వగా, పొగకు ఊపిరాడక 30 గొర్రెలు మృతి చెందాయి. బాధితులకు మొత్తం కలిపి సుమారు రూ. 28 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. చింతకాని – పాతర్లపాడు రహదారి పక్కన ఉన్న పొలాల్లోని మొక్కజొన్న దంటకు తొలుత మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న గ్రామ పంచాయతీ సిబ్బంది ట్యాంకర్ సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే, ఒక్కసారిగా గాలి దుమారం చెలరేగడంతో మంటలు అదుపుతప్పి సమీపంలోని మొక్కజొన్న కల్లాలు, కొనుగోలు కేంద్రం వైపునకు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో రైతులు ఏమీ చేయలేకపోయారు.

అగ్నికి ఆహుతైన ఆశలు..
ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన రైతులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, పుల్లయ్య, అల్లిక శంకర్, గుర్రం రామారావు, టేకుమట్ల పుల్లయ్య, టేకుమట్ల వెంకటేశ్వర్లు, వట్టికూటి రమేష్లకు చెందిన సుమారు 800 క్వింటాళ్ల ధాన్యం (బస్తాలు, నూర్పిడి చేయని కంకుల రాశులు) కాలిపోయింది. చేతికొచ్చిన పంట కళ్లముందే బూడిదవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని విలువ సుమారు రూ. 20 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు.
ముట్టడించిన పొగ.. మూగజీవాల బలి
ఇదే ఘటనలో గొర్రెల కాపరి ఓబీనబోయిన వీరబాబుకు భారీ నష్టం వాటిల్లింది. ఉదయం మేత కోసం మొక్కజొన్న పొలాల్లో వదిలిన గొర్రెలు.. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో వెతకగా, పొగకు ఊపిరాడక పొలంలోనే చనిపోయి కనిపించాయి. సుమారు 30 గొర్రెలు మృతి చెందడంతో తనకు రూ. 8 లక్షల నష్టం కలిగిందని, తన జీవనాధారం దెబ్బతిందని వీరబాబు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు విన్నవిస్తున్నారు.

