ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
అధికారులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
బెల్లంపల్లి, మంచిర్యాల కేంద్రాల్లో పర్యవేక్షణ
కాకతీయ, మంచిర్యాల: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములులతో కలిసి ఆయన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. శాఖల మధ్య సమన్వయం పెంచుకుని, సామాన్యులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అంతకుముందు బెల్లంపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిని సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి కలెక్టర్ సందర్శించారు. అక్కడ దరఖాస్తుల స్వీకరణ తీరును అడిగి తెలుసుకున్నారు.
అధికారులకు దిశానిర్దేశం..
అనంతరం మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

