లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత
కాకతీయ, మంచిర్యాల : గర్భధారణ పూర్వ,గర్భస్థ పిండ ప్రక్రియ నియంత్రణ లింగ ఎంపిక నిషేధ చట్టం 1994 ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశానికి హాజరై జిల్లాలో పని చేస్తున్న స్కానింగ్ కేంద్రాలు,స్త్రీ వైద్య నిపుణుల దగ్గర ఉన్న స్కానింగ్ మిషన్ల ద్వారా,సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఉన్న స్కానింగ్ మిషన్ల ద్వారా అందిస్తున్న వైద్య సేవల పైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం,అడగడం చట్టరీత్యా నేరమని తెలిపారు. భేటీ బచావో బేటి పడావో కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని,ఇందులో భాగంగా గర్భిణీల పర్యవేక్షణ, అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ల పర్యవేక్షణ,తనిఖీలు,రికార్డులు,సి సెక్షన్ ఆడిట్,తల్లులకు మహిళా సంఘాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో బ్రూణ హత్యల నివారణకు కమిటీ సభ్యులందరూ సహకారం అందించాలని తెలిపారు. స్కానింగ్ కేంద్రాలను సందర్శించి లోపాలు ఉన్న వారికి మెమోలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డా. అరుణశ్రీ,డా. శ్రీదేవి,డా. సుధాకర్,డా. అభినవ్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్,డి.పి.ఓ. ప్రశాంతి,సిహెచ్ఓ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ హారిక, వైద్యులు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

