పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం
రాబోయే ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యాచరణ
అక్రమ కేసులు అనడం సరికాదు
మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ రెడ్డి
కాకతీయ, రామకృష్ణాపూర్ : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పని చేస్తామని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్ స్పష్టం చేశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత పార్టీలో పూర్తిస్థాయి కమిటీల నిర్మాణం చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. సోమవారం స్థానిక సూపర్ బజార్ కాంగ్రెస్ కార్యాలయంలో కమిటీల పదవుల కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలోనే అధికారికంగా పూర్తిస్థాయి కమిటీలను ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
దాడులకు పాల్పడినందుకే కేసులు
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నిక సమయంలో జరిగిన దాడులు దురదృష్టకరమని, పోలీసులు చట్టప్రకారమే కేసులు నమోదు చేశారని వోడ్నాల శ్రీనివాస్ పేర్కొన్నారు. హింసను ప్రోత్సహించి ఉద్రిక్తతలకు కారణమైన బాల్క సుమన్, ఆయన అనుచరులపై నమోదైనవి అక్రమ కేసులు కావన్నారు. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌కు సంతకం చేయడానికి వస్తూ.. మీడియా ముందు అక్రమ కేసులంటూ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. చెన్నూరు నియోజకవర్గంలో రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వారు హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిల్లర్లతో కుమ్మక్కై లంచాలు తీసుకున్నారని, నష్టపోయిన రైతులకు కనీసం పరిహారం కూడా అందించలేదని విమర్శించారు. మంత్రి వివేక్ వెంకటస్వామిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోపతి భానేష్, కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాస్, భీమా మల్లేశ్, మాజీ ఛైర్పర్సన్ జంగం కళ, పనాస రాజు తదితరులు పాల్గొన్నారు.

