కరీంనగర్‌లో రణరంగం
ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంపై బీజేపీ నేతల దాడి
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నాడనే సమాచారం దూసుకొచ్చిన నేతలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సురక్షిత ప్రాంతానికి తరలించిన పోలీసులు
కార్యాలయంపై రాళ్ల వర్షం.. కారు అద్దాలు పగలగొట్టి, ఫర్నీచర్ ధ్వంసం
నగరం అంతటా భారీగా మోహరించిన బలగాలు
ఉద్రిక్తతల నేపథ్యంలో 144 సెక్షన్ తరహా నిఘా
“కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు రావాలంటూ గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్
“బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ తీసుకుంటున్నాడు” అంటూ ఇటీవల కౌశిక్ రెడ్డి కౌంటర్
డ్రగ్స్ సవాళ్లతో భగ్గుమన్న రాజకీయం
కాకతీయ, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయం గురువారం రణరంగాన్ని తలపించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు దాడికి యత్నించారు. గురువారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమాలాకర్ క్యాంపు ఆఫీసులో కౌశిక్ రెడ్డి ఉన్నట్లుగా సమాచారం అందుకున్న బీజేపీ నేతలు.. ఆయనపై దాడికి యత్నించారు. ఈసందర్భంగా బీజేపీ నేతలు క్యాంపు ఆఫీసులోని సామగ్రిని, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు హుటాహుటినా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి తరలించారు. కౌశిక్ రెడ్డి, బండి సంజయ్ ల మధ్య ‘డ్రగ్స్ టెస్ట్’ సవాల్.. చివరకు భౌతిక దాడులకు దారితీసింది.
డ్రగ్స్ టెస్ట్ సవాల్.. తంబాకు కౌంటర్‌తో సెగలు!
ఈ వివాదానికి ప్రధాన కారణం గత రెండు రోజులుగా సాగుతున్న మాటల యుద్ధం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని, దమ్ముంటే టెస్టుకు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. దీనికి కౌంటర్ ఇస్తూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తీసుకుంటున్నాడు.. ముందు ఆయన టెస్టుకు రావాలి” అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బీజేపీ శ్రేణులు, కౌశిక్ రెడ్డి కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్నారనే పక్కా సమాచారంతో భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
గన్‌మెన్ల అప్రమత్తత!
కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ‘గో బ్యాక్ కౌశిక్ రెడ్డి’ అంటూ నినాదాలు చేస్తూ ఒక్కసారిగా గేట్లు తోసుకుని లోపలికి చొచ్చుకెళ్లారు. ఆవరణలో ఉన్న ఎమ్మెల్యే కాన్వాయ్‌పై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో కౌశిక్ రెడ్డి వాహనం అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. కార్యాలయంలోని అద్దాలను, కుర్చీలను ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కౌశిక్ రెడ్డి వ్యక్తిగత గన్‌మెన్లు అప్రమత్తమై ఆందోళనకారులను లోపలికి రాకుండా అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను చెల్లాచెదురు చేసి, ఎమ్మెల్యేను సురక్షితంగా వెనక్కి పంపించివేశారు.
దమ్ముంటే చర్చకు రండి.. దాడులు పిరికిపంద చర్య!
ఈ ఘటనపై బీజేపీ నేతలు స్పందిస్తూ.. కేంద్ర మంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. చర్చలకు భయపడే కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు, బీఆర్ఎస్ శ్రేణులు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఓటమి భయంతో, ప్రశ్నించే గొంతును నొక్కేందుకే బీజేపీ ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని, పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కరీంనగర్ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

