కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ సమరభేరి
హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు
బాకీ కార్డులతో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం
మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్
కాకతీయ, హుస్నాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, ప్రతి హామీకి లెక్క చెప్పేలా ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు గ్రామగ్రామాన పర్యటించి కాంగ్రెస్ హామీల వైఫల్యాలను ప్రజల ముందు ఎండగడతాయని తెలిపారు. సెప్టెంబరు 2 నుంచి వారం రోజుల పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి మండలం, మున్సిపాలిటీ, గ్రామం, వార్డులో చేపట్టనున్న కార్యక్రమాలపై ముఖ్య నాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, వెయ్యి రోజులు పూర్తవుతున్నా అనేక హామీలు అమలుకు నోచుకోలేదని సతీష్‌కుమార్ విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, పేదలు, కార్మికులు, కౌలు రైతులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల అమలుపై ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ప్రజలకు గుర్తు చేసేందుకు బాకీ కార్డుల ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాలు, వార్డుల్లో ప్రజా అవగాహన కార్యక్రమాలు, నిరసనలు, హామీలపై చర్చలు చేపడతామన్నారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రజలతో కలిసి స్థానికంగా పోరాటాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజలు కాంగ్రెస్ హామీలను మర్చిపోలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీకి ప్రభుత్వం లెక్క చెప్పాల్సిందేనని అన్నారు. మండల, గ్రామ, పట్టణ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన, మహిళా, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వారం రోజుల కార్యక్రమాలను ప్రజా ఉద్యమంగా మలచాలని వొడితల సతీష్‌కుమార్ పిలుపునిచ్చారు.


