ఆస్ట్రేలియా అత్యున్నత శిఖరంపై పెద్దపల్లి జెండా
తండ్రీ – కొడుకుల అరుదైన ఘనత
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పర్వతారోహణతో సందేశం
కాకతీయ, పెద్దపల్లి : అంతర్జాతీయ పర్వతారోహకుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ లెంకల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన లెంకల మహిపాల్ రెడ్డి తన కుమారుడు లెంకల వివేకానంద రెడ్డితో కలిసి ఆస్ట్రేలియా ఖండంలోని అత్యంత ఎత్తైన మౌంట్ కోసియాస్కో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. 2026 మే 2న ఈ అరుదైన ఘనతను సాధించారు. పర్వత శిఖరంపై “సే నో టు డ్రగ్స్” బ్యానర్‌ను ప్రదర్శిస్తూ యువతకు అవగాహన కల్పించారు. ఇంతకుముందు కూడా వీరిద్దరూ రష్యాలోని యూరప్ ఖండంలో అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్‌బ్రస్‌ను అధిరోహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. తండ్రి-కొడుకుల విజయానికి ప్రశంసలు
ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తండ్రి-కొడుకుల విజయాన్ని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పర్వతాలను అధిరోహించి రాష్ట్రం, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎంఓ ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

