జనరంజకం.. ఆకాశవాణి ప్రస్థానం
సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ టి.భరత్
ఘనంగా 90 వసంతాల వార్షికోత్సవ వేడుకలు
కొత్తగూడెం కేంద్రం ఆధ్వర్యంలో ‘3కే వాక్తాన్’
కాకతీయ, కొత్తగూడెం : దేశ ప్రజల గళంగా, సమాచార వారధిగా విరాజిల్లుతున్న ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తగూడెం కేంద్రంలో శుక్రవారం వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ‘వాయిస్ ఆఫ్ నేషన్’ వేడుకల్లో భాగంగా ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే వాక్తాన్ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ టి.భరత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ రేడియో స్టేషన్ నుండి ప్రారంభమై 14 నంబర్ ఏరియా, రామవరం సెంటర్, 2టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా తిరిగి కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా కొత్తగూడెం స్టేషన్ ప్రోగ్రాం హెడ్ కొలిపాక శంకర రావు మాట్లాడుతూ.. 1936లో దక్కన్ రేడియోగా ప్రారంభమైన ప్రస్థానం నేడు ఆకాశవాణిగా 90 ఏళ్లు పూర్తి చేసుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ‘బహుజన హితాయ: బహుజన సుఖాయ:’ అన్న నినాదంతో మారుమూల గ్రామాల్లోని రైతులకు, సామాన్యులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తోందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, తుపానుల సమయంలో ప్రజలకు ముందస్తు సమాచారం అందిస్తూ ఎందరో ప్రాణాలను కాపాడటంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రామవరం పశు వైద్యాధికారి డాక్టర్ ఆనంద్, పర్యావరణ ప్రేమికుడు నూర్వి రాజశేఖర్, ఆకాశవాణి సిబ్బంది, రేడియో వ్యాఖ్యాతలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

