విద్యార్థులకు విజ్ఞానం.. వినోదం
అశ్వాపురం పీఎంశ్రీ పాఠశాలలో 11 నుంచి వేసవి శిబిరం
వినోదాత్మక రీతిలో నైపుణ్యాల పెంపునకు కృషి
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యోగితావేణి
కాకతీయ, అశ్వాపురం/మణుగూరు : “వేసవి సెలవుల్లో విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు, కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు సమ్మర్ క్యాంప్లు ఎంతగానో దోహదపడతాయి” అని అశ్వాపురం పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యోగితావేణి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పాఠశాల ఆవరణలో ఈనెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు విద్యార్థులకు ప్రత్యేక వేసవి శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ ఈ శిబిరంలో పాల్గొనవచ్చని ప్రధానోపాధ్యాయురాలు యోగితావేణి తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉపాధ్యాయుల ప్రత్యక్ష పర్యవేక్షణలో వివిధ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. విద్యార్థులకు చదువుతో పాటు వినోదాన్ని పంచేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. శిబిరానికి వచ్చే విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టిక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన స్నాక్స్ అందిస్తామని పేర్కొన్నారు.
బహుముఖ నైపుణ్యాలపై శిక్షణ
కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించేందుకు పలు అంశాలను శిబిరంలో చేర్చినట్లు యోగితావేణి వివరించారు.
ఆర్ట్, క్రాఫ్ట్, నృత్యం మరియు సంగీతం, వివిధ రకాల ఆటలు, యోగా మరియు శారీరక వ్యాయామం ఉంటుంది.అలాగే కంప్యూటర్ నైపుణ్యాలు మరియు సైన్స్ ప్రయోగాలు. క్విజ్, కథల సమయం, పఠనం మరియు మెదడుకు పదును పెట్టే వ్యాయామాలు ఉంటాయి. అవకాశాన్ని మండలంలోని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వేసవి కాలాన్ని వృథా చేయకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

