మలేషియాలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
కాకతీయ, హైదరాబాద్ : మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జూన్ 6న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. బీఆర్ఎస్ మలేషియా మరియు మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) సంయుక్త ఆధ్వర్యంలో కౌలాలంపూర్లోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.తిరుపతి, మహిళా అధ్యక్షురాలు కిరణ్మయి, సభ్యులు సుప్రియ, అశ్విత, శివలతో కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విదేశాల్లో ఉన్నా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేలా ఉత్సవాలు ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ పాల్గొని వేడుకల నిర్వహణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ సభ్యులు మరియు బిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

