హైదరాబాద్ అభివృద్ధికి ‘క్యూర్’ మంత్రం
సిటీని ట్రాఫిక్ ఫ్రీగా మార్చడమే మా లక్ష్యం
కాలుష్య నివారణకు ఈవీ ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్
మూసీ పునరుజ్జీవం ఒక సామాజిక విప్లవం
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో కీలక సమావేశం
‘రైజింగ్ 2047’ విజన్ ఆవిష్కరణ
కాకతీయ,తెలంగాణ బ్యూరో : భాగ్యనగరాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో జరిగిన కీలక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పెరుగుతున్న నగరీకరణ వల్ల రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడమే లక్ష్యంగా రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్‌ను ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు అందజేశారు.
మూడు అంచెల వ్యూహం – ఆర్థికాభివృద్ధి
తెలంగాణ రాష్ట్రాన్ని భౌగోళికంగా, ఆర్థికంగా మూడు ప్రధాన విభాగాలుగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని ముఖ్యమంత్రి వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్)ని ప్రధానంగా ‘సర్వీస్ సెక్టార్’గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఓఆర్ఆర్ వెలుపల నుంచి రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్)ని ‘మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్’గాను, రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్)ని వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి కేంద్రంగా మారుస్తామని వెల్లడించారు. ఈ వ్యూహాత్మక విభజన వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానమైన ప్రాధాన్యత లభిస్తుందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధిపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీకి వివరించారు.
ట్రాఫిక్ రహిత నగరం – పర్యావరణ పరిరక్షణ
హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఇబ్బందులు లేని నగరంగా మార్చేందుకు అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లు మరియు ఉపరితల రోడ్ల వంటి బహుళ రవాణా మార్గాలను అభివృద్ధి చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్కింగ్ సమస్యల పరిష్కారానికి నగరవ్యాప్తంగా మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, ఆర్టీసీలో ఈవీ బస్సుల సంఖ్యను పెంచుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి, వాటిని పర్యావరణ అనుకూల ఈవీ వాహనాలుగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టును విప్లవాత్మక నిర్ణయంగా అభివర్ణించిన పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సభ్యులు.. ఇలాంటి ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

