రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
ఒకరి పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు
కాకతీయ, కామేపల్లి : ఖమ్మం–డోర్నకల్ ప్రధాన రహదారిపై కామేపల్లి మండలం కొత్త లింగాల గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ప్రయాణిస్తున్న డీసీఎం వాహనం నుంచి ముగ్గురు వ్యక్తులు కిందపడిపోవడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి డోర్నకల్ వైపు ఒక డీసీఎం వాహనం వెళ్తోంది. కొత్త లింగాల గ్రామ సమీపంలోకి రాగానే, ఎదురుగా వస్తున్న ఒక బైక్‌ను తప్పించే క్రమంలో డీసీఎం డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వాహనం క్యాబిన్ పైన కూర్చున్న ముగ్గురు వ్యక్తులు అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. వాహనం వేగంగా ఉండటంతో వారు కిందపడగానే తీవ్రమైన గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరికీ కూడా ఒంటిపై బలమైన గాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గురైన వారు ఎక్కడి వారు? అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

