జూనియర్ కళాశాల నిధులు స్వాహా!
మాజీ ఇంచార్జ్ ప్రిన్సిపాల్‌పై మంత్రి పొంగులేటి వద్ద ఫిర్యాదు
రూ.10 లక్షల గోల్‌మాల్‌పై విచారణకు ఆదేశం
కాకతీయ, కూసుమంచి : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పరిధిలోని పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిధుల దుర్వినియోగం వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో ఇక్కడ ఇంచార్జ్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఉపేందర్ అనే అధికారి, కళాశాల అభివృద్ధి నిధులను అక్రమంగా డ్రా చేసి వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపిస్తూ శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఫిర్యాదు అందింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వాతి ఈ మేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఫిర్యాదు అందజేశారు. మాజీ ప్రిన్సిపాల్ ఉపేందర్ తాను బదిలీపై వెళ్లే సమయంలో నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకొని సుమారు 10 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను కాజేశారని ఆమె ఆరోపించారు. కళాశాల అభివృద్ధికి వినియోగించాల్సిన సొమ్మును ఒక ప్రభుత్వ అధికారి ఇలా స్వాహా చేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కఠిన చర్యలకు గ్రామస్తుల డిమాండ్
ప్రభుత్వ సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్న ఉపేందర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని, వెంటనే అతన్ని విధుల నుండి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిండిప్రోలు గ్రామస్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రజల ఫిర్యాదుపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. ఈ నిధుల గోల్‌మాల్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని అధికారులను ఆదేశించారు.

