అక్రమ ఇసుక నిల్వలు సీజ్
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు
అశ్వాపురం ఆర్ఐ లీలావతి హెచ్చరిక
కాకతీయ, అశ్వాపురం/మణుగూరు : అశ్వాపురం మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులపై రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. సోమవారం మండల ఆర్ఐ లీలావతి నేతృత్వంలో నిర్వహించిన దాడుల్లో భారీగా ఇసుక నిల్వలను సీజ్ చేయడంతో పాటు, అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. చింత్రియాల క్రాస్ రోడ్డు, చింతిర్యాల కాలనీ, సండ్రలబోడు గ్రామాలలో జరిపిన తనిఖీల్లో సుమారు 45 ట్రాక్టర్ల ఇసుక నిల్వలను గుర్తించి సీజ్ చేశారు. అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్ఐ తెలిపారు.
నిఘా కొనసాగుతుంది
ఈ సందర్భంగా ఆర్ఐ లీలావతి మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను డంప్ చేయడం లేదా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. మండలంలో ఎక్కడైనా అక్రమ నిల్వలు కనిపిస్తే వాటిని సీజ్ చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు కూడా నిబంధనల మేరకే ఇసుక కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. అక్రమ రవాణాపై తమ నిఘా నిరంతరం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.

