గుప్త నిధుల తవ్వకాల గుట్టు విప్పుతాం
శివాలయంలో అర్ధరాత్రి తవ్వకాలు ఎందుకు?
లంక బిందెల వెలికితీతపై విచారణ జరపాలి
పురావస్తు శాఖ ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ ఎందుకు కట్టలేదు?
రేవంత్ పాలనలో బడులకే కాదు గుడులకు కూడా రక్షణ లేదు
ఖానాపురం శివాలయం కూల్చివేతపై మాజీమంత్రి హరీష్‌రావు ఆగ్రహం
మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యే పెద్దితో కలిసి ఆలయ సందర్శన
కాకతీయ, నర్సంపేట: “రేవంత్ రెడ్డి పాలనలో కేవలం బడులు మాత్రమే కాదు.. గుడుల విధ్వంసం కూడా జరుగుతోంది. 800 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయుల నాటి శివాలయాన్ని గుప్త నిధుల కోసమే ఉద్దేశపూర్వకంగా కూల్చేశారు” అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. సోమవారం నర్సంపేట డివిజన్ ఖానాపూర్ మండలం అశోక్ నగర్‌లో ధ్వంసమైన మట్టికోట శివాలయాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలతో కలిసి ఆయన సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.

అర్ధరాత్రి తవ్వకాల వెనుక మర్మమేమిటి?
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం సాకుతో చారిత్రక కట్టడాన్ని నేలమట్టం చేయడంపై హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “స్కూల్ కట్టాలంటే పగలు పనులు చేసుకోవచ్చు.. కానీ అర్ధరాత్రి 12 నుంచి 1 గంటల మధ్య గర్భగుడి కింద 24 అడుగుల లోతున భారీ గుంతలు ఎందుకు తవ్వారు? పురావస్తు శాఖ జిల్లా అధికారి బుజ్జి ఈ నెల 7వ తేదీనే కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?” అని ప్రశ్నించారు. ఈ తవ్వకాల్లో బయటపడ్డ గుప్త నిధులు, లంక బిందెలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో దేవాలయ భూమిగా ఉన్న స్థలం, ఇప్పుడు ప్రభుత్వ భూమిగా ఎలా మారిందని నిలదీశారు. వెంటనే శివాలయాన్ని పునరుద్ధరించాలని, పురావస్తు చట్టం ప్రకారం దీనిని ప్రభుత్వమే రక్షించాలని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే
ఈ గుప్త నిధుల వ్యవహారంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ మరియు విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామని హరీశ్ రావు వెల్లడించారు. పురావస్తు శాఖ ఫిర్యాదు మేరకు బాధ్యులను అరెస్ట్ చేసి, తవ్వకాలకు వాడిన యంత్రాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
టెండర్లలో రూ.494 కోట్ల దోపిడీ!
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 76 స్కూళ్ల టెండర్లను 4.86 నుంచి 4.99 శాతం ఎక్సెస్‌తో కేటాయించి దాదాపు రూ.494 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. నర్సంపేటలో రూ.136 కోట్ల పనిని రూ.142 కోట్లకు అప్పగించడమే దీనికి నిదర్శనమన్నారు. తమకు అనుకూలమైన రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజనీర్‌గా నియమించుకుని ఈ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. టెండర్లు దక్కించుకున్న వారు బీఆర్ఎస్ వారేనని ప్రభుత్వం చెబుతుంటే.. ఆ టెండర్లను వెంటనే రద్దు చేసే ధైర్యం ఉందా? అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాకతీయుల వారసత్వ సంపదను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నేతలు విమర్శించారు.

