ఉపాధి పనుల ఆకస్మిక తనిఖీ
కూలీల సమస్యలపై డీఆర్డీఓ ఆరా
ఆధార్ అనుసంధానమే సమస్యలకు పరిష్కారం
ఫీల్డ్ లెవల్‌లో పనులను పరిశీలించిన జిల్లా అధికారి శ్రీరామ్
కాకతీయ, కారేపల్లి : మండల పరిధిలోని భజ్య తండా గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఖమ్మం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) శ్రీరామ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, కూలీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలకు ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను అడిగి తెలుసుకున్న ఆయన, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తనిఖీ సందర్భంగా కూలీలు తమ గోడును డీఆర్డీఓ ముందు వెళ్లబోసుకున్నారు. క్షేత్రస్థాయిలో తమ ఫోటోలు సక్రమంగా అప్‌లోడ్ కావడం లేదని, దీనివల్ల హాజరు నమోదులో ఇబ్బందులు వస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన డీఆర్డీఓ, సర్వర్ సమస్యల కారణంగా కొన్నిసార్లు ఫోటోల అప్‌లోడింగ్‌లో జాప్యం జరుగుతుందని, దీనిపై ఎవరూ ఆందోళన చెందవద్దని కూలీలకు నచ్చజెప్పారు. హాజరు విషయంలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మరికొందరు కూలీలు డిమాండ్‌లో తమ పేర్లు రావడం లేదని ఫిర్యాదు చేయగా, అందుకు గల సాంకేతిక కారణాలను ఆయన వివరించారు. ఆధార్ కార్డులు అప్‌డేట్ కాని వారికి ఈ-కేవైసీ పూర్తి కావడం లేదని, అందుకే పేర్లు నమోదు కావడం లేదని తెలిపారు. ఆధార్ కార్డులో ఒక పేరు, ఉపాధి హామీ కార్డులో మరో పేరు ఉండటం వల్ల డిమాండ్ జనరేట్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే ఆధార్ వివరాలను సరిచేయించుకోవాలని కూలీలకు సూచించారు. ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీకి న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, సాంకేతిక లోపాలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పొన్నూరు శ్రీనివాస్ రావు, ఏపీఓ కోటేశ్వరరావు, ఈసీ సుధీర్, పంచాయతీ కార్యదర్శి ధరావత్ జ్యోతి, సర్పంచ్ వాంకుడోత్ హనుమంత రావు, టెక్నికల్ అసిస్టెంట్లు, మేట్లు పాల్గొన్నారు.

