మత్తులో ఎక్సైజ్ శాఖ
భద్రాచలంలో జోరుగా మద్యం అక్రమ దందా
పత్రికల్లో కథనాలు వచ్చినా కదలని యంత్రాంగం
బెల్ట్ షాపులతో స్థానికులకు తప్పని తిప్పలు
కాకతీయ, భద్రాచలం (మణుగూరు) : పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో మద్యం అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి నివాస ప్రాంతాల మధ్యే బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి, అనుమతి లేని సమయాల్లోనూ యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. మద్యం సిండికేట్లుగా మారిన కొందరు వ్యాపారులు మద్యం బాటిళ్లపై ఎమ్మార్పీ కంటే అదనపు ధరలు వసూలు చేస్తూ సామాన్యులను నిలువునా దోచుకుంటున్నారు. ఈ దందాపై గత నాలుగు రోజులుగా పత్రికల్లో వరుసగా కథనాలు వస్తున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు, రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున కమిషన్లు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కాలనీల్లో మద్యం బాబుల న్యూసెన్స్
పట్టణంలోని పలు కాలనీలు, ప్రధాన నివాస ప్రాంతాల మధ్యే ఈ అక్రమ విక్రయాలు సాగుతుండటంతో మహిళలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మద్యం బాబుల న్యూసెన్స్ భరించలేకపోతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం, నిశ్శబ్దం అక్రమార్కులకు మరింత బలాన్ని చేకూరుస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భద్రాచలం, మణుగూరు ప్రాంతాల్లో సాగుతున్న మద్యం దందాపై సమగ్ర విచారణ జరిపించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి అక్రమార్కులకు సహకరిస్తున్న అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో స్థానిక ప్రజల మద్దతుతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

