మాజీ ఎంపీటీసీ మృతికి ఎమ్మెల్యే రేవూరి నివాళి
కాకతీయ, గీసుగొండ: గీసుగొండ మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు దౌడు కోమల అకాల మరణం పట్ల పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం ఆమె నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే.. కోమల మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ.. దౌడు కోమల ప్రజాసేవలో చురుకుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆమె మరణం కుటుంబానికే కాకుండా నియోజకవర్గానికి, పార్టీకి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎరబెల్లి ఇనాయత్ అలీ (అయూబ్), మండల పార్టీ అధ్యక్షుడు దాడి శివ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

