నష్టపోయాం.. న్యాయం చేయండి సారూ..!
ఏళ్లుగా సాధించుకున్న సాగు భూమిలో స్కూల్ కడుతారంట
ఆదివాసి మహిళల ఆవేదన.. తహసీల్దార్ కార్యాలయంలో వినతి
కాకతీయ,అశ్వాపురం(మణుగూరు): అశ్వాపురం మండలంలోని బిజీ కొత్తూరు గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న నవోదయ పాఠశాల కోసం తాము సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ ఆదివాసి మహిళలు శుక్రవారం అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవనోపాధిగా ఉన్న సాగు భూములను ముందస్తు సమాచారం లేకుండా తీసుకోవడం వల్ల తమ కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి తమకు ప్రత్యామ్నాయ భూములు లేదా తగిన నష్టపరిహారం కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు.. సమస్యను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

