సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి
ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా ముందంజ
‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ సదస్సులో కలెక్టర్ దివాకర టీఎస్
కాకతీయ, ఖమ్మం, బ్యూరో : ప్రజాప్రతినిధులు, అధికారుల పరస్పర సమన్వయంతోనే జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. శుక్రవారం నగరంలోని స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించిన ‘99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ జిల్లా స్థాయి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, భవిష్యత్ లక్ష్యాలను ప్రజలకు వివరించేందుకే ఈ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏ ప్రభుత్వ పథకమైనా విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభంలో లబ్ధిదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, స్థానిక ప్రజాప్రతినిధుల చొరవ, ఇందిరా మహిళా శక్తి కింద బ్యాంకు రుణాలు కల్పించడంతో పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసి ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన జాబ్ మేళా ద్వారా జిల్లా యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించామని గుర్తుచేశారు.

వేసవి కార్యాచరణ.. పారిశుధ్యానికి ప్రాధాన్యత
జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని రద్దీ ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుధ్య పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, విస్తృతంగా మొక్కలు నాటాలని కోరారు. పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉంటేనే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చన్నారు. అలాగే, ప్రభుత్వం త్వరలోనే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్థుల వరకు విస్తరించనుందని, పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించనుందని తెలిపారు. దివ్యాంగ విద్యార్థులకు బ్యాటరీ వాహనాల పంపిణీ కూడా త్వరలోనే మొదలవుతుందన్నారు. అంతకుముందు వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పురోగతిని, లబ్ధిదారుల వివరాలను సభకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ చైర్‌పర్సన్‌లు, నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

