టర్కీలో పొలిటికల్ క్రైసిస్
ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌పై విచారణ.. 13 మంది అరెస్ట్
పార్టీ లీడర్ ఓజ్‌గుర్ ఓజెల్ తొలగింపు తర్వాత ముదిరిన సంక్షోభం
కోర్టు తీర్పును ‘జ్యుడీషియల్ కూప్ గా అభివర్ణించిన ప్రతిపక్షం
అక్రమ ఓటింగ్, లంచాలు, మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ
కాకతీయ, నేషనల్ డెస్క్ : టర్కీలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రధాన ప్రతిపక్షమైన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ 2023 కాంగ్రెస్ (మహాసభ) పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా శనివారం టర్కీ పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే కోర్టు తీర్పు ద్వారా పార్టీ లీడర్ ఓజ్‌గుర్ ఓజెల్‌ను పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. గురువారం టర్కీ అప్పీల్స్ కోర్టు 2023 నాటి పార్టీ మహాసభల్లో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ, ఓజెల్ ఎన్నికను రద్దు చేసింది. దాంతో మాజీ ఛైర్మన్ కెమాల్ కిలిచ్‌దారోగ్లు మళ్లీ ఆ పదవిలోకి వచ్చారు. ఈయన 2023 దేశాధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ రెసెప్ తయీప్ ఎర్డోగాన్ చేతిలో ఓడిపోయారు. ఈ కోర్టు తీర్పును ప్రతిపక్షం ‘న్యాయవ్యవస్థ తిరుగుబాటు’గా పేర్కొంది. తాము దీనిపై లీగల్ పోరాటం చేస్తామని, అంకారాలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉంటానని ఓజెల్ స్పష్టం చేశారు.
లంచాలు, మనీ లాండరింగ్ ఆరోపణలు:
ఇస్తాంబుల్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ సమాచారం ప్రకారం.. 2023 మహాసభల్లో ప్రతినిధుల ఓటింగ్‌ను ప్రభావితం చేశారనే ఆరోపణలపై 7 ప్రావిన్సుల్లో ఈ అరెస్టులు జరిగాయి. నిందితులపై ‘రాజకీయ పార్టీల చట్టాల ఉల్లంఘన’, ‘లంచాలు తీసుకోవడం’, ‘క్రైమ్ మనీని లాండరింగ్ చేయడం’ వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇస్తాంబుల్, అంకారా, ఇజ్మీర్ సహా పలు నగరాల్లోని నిందితుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. టర్కీలో ప్రజాస్వామ్యానికి, అధికార పక్ష నియంతృత్వానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ఈ కోర్టు తీర్పు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని పొలిటికల్ ఎనలిస్టులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఎర్డోగాన్ పట్టును మరింత పెంచే అవకాశం ఉందంటున్నారు. నిజానికి టర్కీలో తదుపరి ఎన్నికలు 2028లో జరగాల్సి ఉంది. కానీ, రాజ్యాంగ నిబంధనల ప్రకారం 72 ఏళ్ల ఎర్డోగాన్ మళ్లీ పోటీ చేయాలంటే ముందస్తు ఎన్నికలు రావాల్సి ఉంటుంది. తాజా కోర్టు తీర్పు ఆ ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. అయితే, కోర్టులు స్వతంత్రంగా పనిచేస్తున్నాయని, రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం లేదని టర్కీ ప్రభుత్వం వాదిస్తోంది.

