అభివృద్ధిని అడ్డుకుంటారా?
ప్రజాప్రతినిధుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం
చెగర్షల పంచాయతీ కార్యాలయం ముట్టడి
సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం
కాకతీయ,పినపాక : పినపాక మండలం చెగర్షల గ్రామపంచాయతీలో అభివృద్ధి పనుల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ తదితర దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విసుగు చెందిన ప్రజలు సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధికి సహకరించకుండా, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళనకారులు బహిరంగంగా ఆరోపించారు. గ్రామంలో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీలు, అధ్వానపు రోడ్ల వల్ల నిత్యం ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.

