పంటల అవశేషాల దహనం.. పంటలు, మోటార్లు బుగ్గిపాలు!
గాలికి అదుపు తప్పుతున్న మంటలు.. పక్క పొలాలకు వ్యాప్తి
కాకతీయ, ఏన్కూర్ : ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల వ్యాప్తంగా మొక్కజొన్న, వరి పంటల కోతల అనంతరం పొలాల్లో మిగిలిన వ్యవసాయ అవశేషాలకు రైతులు బాధ్యతారాహిత్యంగా నిప్పు పెడుతున్నారు. ఈ మంటలు గాలికి అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలాలకు వ్యాపిస్తూ భారీ నష్టాలను మిగులుస్తున్నాయి. పలుచోట్ల పొలాల్లో ఉన్న నీటి మోటార్లు, విద్యుత్ తీగలు, డ్రిప్ పైపులు మంటల్లో కాలి బూడిదవుతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగం!
వ్యవసాయ అవశేషాలను తగలబెట్టడం వల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు తదుపరి పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ మండలంలోని పలు గ్రామాల్లో ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ఈ దహనకాండ జరుగుతూనే ఉంది. ఈ మంటలు రోడ్ల వెంట ఉన్న చెట్లకు కూడా వ్యాపించి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం చూసీ చూడనట్టు తూతూమంత్రంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులకు అవగాహన కల్పించి ఇటువంటి ప్రమాదాలపై హెచ్చరించాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించి, అవశేషాల దహనాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.

