టీచర్లకు అడ్మిషన్ల టార్గెట్లు
ఒత్తిడితో ప్రైవేటు ఉపాధ్యాయుల అవస్థలు
సెలవుల్లోనూ ఇళ్ల చుట్టూ తిరగాలంటూ యాజమాన్యాల హుకుం
పూర్తి చేయకుంటే ఉద్యోగాలకే ముప్పు
కనీసం సొంత పిల్లల ఫీజులకూ మినహాయింపు లేదు
వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం.. అధికారుల జోక్యానికి డిమాండ్
కాకతీయ,మణుగూరు: ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. విద్యాసంవత్సరం పొడవునా విద్యార్థులకు మార్కులు, ర్యాంకుల నిమిత్తం ఒత్తిడి తెచ్చే యాజమాన్యాలు.. తీరా వేసవి సెలవులు వస్తే అడ్మిషన్ల టార్గెట్లతో వారి రక్తం తాగుతున్నాయని మణుగూరు నియోజకవర్గంలోని పలువురు ప్రైవేటు టీచర్లు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో అడ్మిషన్లు రాబట్టకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగుతుండటంతో ఉపాధ్యాయులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.

జీతం రూ.10 వేలు.. టార్గెట్లు మాత్రం కొండంత!
స్థానిక వివరాల ప్రకారం.. నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా 5 నుంచి 10 అడ్మిషన్లు చేయించాలని యాజమాన్యాలు కఠిన నిబంధనలు పెట్టాయి. ఒక్కో అడ్మిషన్‌కు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు కమీషన్ ఇస్తామని ఆశచూపి, తీరా చేర్పించాక ఆ డబ్బులు ఎగ్గొడుతున్నారని కొందరు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారాలు, పండుగ సెలవుల్లోనూ విశ్రాంతి లేకుండా ఇళ్ల చుట్టూ తిరుగుతూ.. ‘మా స్కూల్లోనే చేర్పించండి.. ఫీజులు తగ్గిస్తాం’ అంటూ తల్లిదండ్రుల కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నెలకు రూ.10 వేల లోపే జీతం తీసుకునే ఉపాధ్యాయులకు వారి స్వంత పిల్లల ఫీజుల్లో కనీస మినహాయింపు ఇవ్వకపోవడం గమనార్హం. తమ పిల్లల చదువుల కోసం నెలకు రూ.5 వేల వరకు స్కూలుకే కట్టాల్సి వస్తోందని, కొందరైతే అప్పులు తెచ్చి మరీ ఫీజులు చెల్లిస్తున్నామని కన్నీరుమున్నీరవుతున్నారు.
కుటుంబాల్లో చిచ్చు.. అధికారుల పర్యవేక్షణేది?
ఈ అడ్మిషన్ల ఒత్తిడి ఉపాధ్యాయుల వ్యక్తిగత, కుటుంబ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటీవల మణుగూరులోని ఒక పాఠశాలలో పనిచేసే మహిళా టీచర్ రోజంతా అడ్మిషన్ల వేటలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తోందనే కోపంతో.. ఆమె భర్త నేరుగా పాఠశాలకే వచ్చి యాజమాన్యంతో గొడవకు దిగినట్లు సమాచారం. ప్రైవేటు విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బందిపై జరుగుతున్న ఇటువంటి మానసిక వేధింపులను అరికట్టాలని, శ్రమ దోపిడీకి పాల్పడుతున్న స్కూళ్లపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.

