చికెన్ కర్రీలో బల్లి..
దాబా నిర్వాహకులపై క్రిమినల్ కేసులు!
ఖమ్మం రమేశ్ దాబాలో కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం
తనిఖీల్లో వెలుగుచూసిన పురుగులు పట్టిన మాంసం, కుళ్లిన గుడ్లు
కాకతీయ , పాలేరు : ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని దాబాలు కల్తీ తిండికి అడ్డాగా మారుతున్నాయి. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్ వద్ద గల రమేశ్ దాబాలో ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన చికెన్ కర్రీలో బల్లి రావడంతో తీవ్ర కలకలం రేగింది. కూరలో బల్లిని చూసి కంగుతిన్న కస్టమర్ నిర్వాహకులను ప్రశ్నించగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో దాబా వద్ద పెద్ద ఎత్తున ఘర్షణ, ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. ఈ ఘటనతో రంగంలోకి దిగిన అధికారులు దాబా వంటగదిని పరిశీలించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అక్కడ కస్టమర్ల కళ్లెదుటే పురుగులు పట్టిన చికెన్, పూర్తిగా కుళ్లిపోయిన కోడిగుడ్లు దర్శనమిచ్చాయి. వంటగది పరిసరాలు అత్యంత అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా, మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్‌లో ఉంచి మళ్లీ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కేవలం రుచి కోసం విపరీతంగా టేస్టింగ్ సాల్ట్ వాడుతూ తిండి ప్రియుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నట్లు తేలింది.
అధికారుల మామూళ్లు.. కస్టమర్ల అవస్థలు
ఏదులాపురం, రూరల్ మండల పరిధిలోని దాబాల్లో నాసిరకం ఆహారంపై గతంలోనూ పలుమార్లు గొడవలు జరిగాయి. ఆహారంలో పురుగులు, బల్లులు వస్తున్నాయని కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నా, నిఘా పెట్టాల్సిన ఆహార భద్రతా అధికారులు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాబా నిర్వాహకుల నుంచి అందుతున్న నెలవారీ మామూళ్ల వల్లే అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
క్రిమినల్ కేసులు పెడతాం : ఫుడ్ ఇన్‌స్పెక్టర్
రమేశ్ దాబా చికెన్ కర్రీలో బల్లి వచ్చిన ఉదంతం తమ దృష్టికి వచ్చిందని ఖమ్మం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ లోకేష్ తెలిపారు. సదరు దాబాను క్షుణ్ణంగా పరిశీలించామని, కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న నిర్వాహకులపై చట్టపరంగా కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

