శ్మశాన వాటికలో ప్రత్యేక గదుల నిర్మాణం
స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, కుడా ఛైర్మన్
యంత్రాంగం తరుపున పూర్తి సహకారం అందిస్తాం : కుడా చైర్మన్ ఇనుగాల
కాకతీయ, హన్మకొండ టౌన్ : అనాథలు మరియు అద్దె ఇళ్లలో ఉంటూ మరణించిన నిరుపేదల అంత్యక్రియల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడానికి హనుమకొండ పద్మాక్షి కాలనీలోని శ్మశాన వాటికలో ఒక ప్రత్యేక గదిని నిర్మించేందుకు సామాజిక కార్యకర్త, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అనితా రెడ్డి ముందుకు వచ్చారు. కిరాయి ఇళ్లలో ఎవరైనా చనిపోతే భౌతికకాయాన్ని ఇంటి ముందు ఉంచేందుకు కొందరు యజమానులు నిరాకరిస్తున్న సంఘటనలను, అనాథల ఇబ్బందులను గమనించిన ఆమె.. ఈ సున్నితమైన సమస్య పరిష్కారానికి శ్మశాన వాటికలోనే భౌతికకాయాన్ని ఉంచి అంతిమ సంస్కారాలు ముగించేలా ఒక గది నిర్మించాలని నిర్ణయించారు.
సంయుక్తంగా స్థల పరిశీలన..
ఈ బృహత్తర కార్యక్రమానికి సంబంధించిన స్థలాన్ని మరియు శ్మశాన వాటిక పరిసరాలను సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ఛాహత్ బాజ్‌పాయ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అనితా రెడ్డిలతో కలిసి సంయుక్తంగా పరిశీలించారు. శ్మశాన వాటికలో గది నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయించేలా అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కుడా చైర్మన్ మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలు, అనాథలు మరణించినప్పుడు వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక ఇబ్బందులను గుర్తించి, వారి అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా జరిగేలా గది నిర్మాణానికి ముందుకు వచ్చిన అనితా రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ మానవీయ ప్రాజెక్టు విజయవంతం కావడానికి ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని వారు స్పష్టం చేశారు. శ్మశాన వాటికలో అవసరమైన కనీస వసతులను కూడా మెరుగుపరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు మరియు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

