కాటన్ ఇండస్ట్రీకి రూ.5,659 కోట్ల భారీ నిధులు
కపాస్ క్రాంతి మిషన్”పై కేంద్ర ఉన్నతాస్థాయి సమీక్ష
వరంగల్ నుంచి హాజరైన బొమ్మినేని రవీందర్ రెడ్డి
కాకతీయ, వరంగల్ : దేశవ్యాప్తంగా పత్తి రంగ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “కపాస్ క్రాంతి మిషన్”పై సోమవారం జాతీయ ఉన్నతాస్థాయి ఆన్‌లైన్ సమావేశం జరిగింది. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక సమావేశంలో తెలంగాణ పత్తి మిల్లుల యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బొమ్మినేని రవీందర్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు. మన రాష్ట్ర పత్తి పరిశ్రమ, రైతుల తరపున ఆయన కేంద్రానికి పలు అమూల్యమైన సూచనలు చేశారు. వచ్చే ఐదేళ్ల కాలానికి గానూ కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ కోసం రూ.5,659.22 కోట్ల భారీ నిధులకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ పత్తి బ్రాండ్ అయిన “కస్తూరి కాటన్ భారత్” కొనుగోలు, అమ్మకాల్లో పారదర్శకత కోసం ప్రత్యేక అంతర్జాల వేదికను తీసుకురావడం, జిన్నింగ్ పరిశ్రమల ఆధునికీకరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. పత్తి ఏరడంలో పాలిస్టర్ సంచుల వాడకం వల్ల కాలుష్యం పెరుగుతోందని, దీన్ని అరికట్టేందుకు రైతులకు పత్తి సంచులు, టోపీలను ఉచితంగా లేదా రాయితీపై ఇవ్వాలని కోరారు. నకిలీ విత్తనాల వల్ల పత్తిలో వ్యర్థాలు పెరిగి మిల్లులు నష్టపోతున్నాయని, అందుకే విత్తే సమయానికే ప్రభుత్వ గుర్తింపు పొందిన నాణ్యమైన విత్తనాలనే రైతులకు అందుబాటులోకి తేవాలన్నారు. అలాగే పత్తి నాణ్యత పరీక్ష కోసం ప్రతిపాదించిన రూ.10,000 ఫీజు చిన్న వ్యాపారులకు భారమని, దానిని రూ.500 నుండి రూ.1,000 లోపుకు తగ్గించాలని డిమాండ్ చేశారు. పాత జిన్నింగ్ మిల్లుల్లో కాలుష్య నివారణ యంత్రాల ఏర్పాటుకు కేంద్రం 75 శాతం రాయితీ ఇవ్వాలని, కస్తూరి పత్తిని విదేశాలకు ఎగుమతి చేసే మిల్లులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తే వారు మార్కెట్లో రైతులకు మంచి ధర చెల్లించి కొనుగోలు చేస్తారని వివరించారు. కొత్తగా తెచ్చే అంతర్జాల వేదిక స్థానిక వ్యాపారులకు సులభంగా అర్థమయ్యేలా ఉండాలని, ఈ మిషన్ ముసాయిదాపై మిల్లుల యజమానులతో చర్చించి తుది అభిప్రాయాలను ప్రభుత్వానికి అందజేస్తామని రవీందర్ రెడ్డి తెలిపారు.

